ఎన్డియే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
ఏజెన్సీ ప్రాంత రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
ఇక డోలీ మోతలుండవు
విశాఖ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో హెూంమంత్రి అనిత
విశాఖపట్నం
ఎన్డియే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.పార్టీలతో సంబంధం లేకుండా సేవ చేస్తున్నామన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన జిల్లా జెడ్పీ సమావేశానికి హాజరైన ఆమె అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మిస్తామని, ఇకపై డోలీ మోతలే ఉండవని అభయ మిచ్చారు. జెడ్పీ చ్కెర్పర్సన్ జె. సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రి అనిత తొలిసారి రావడంతో ఆమెను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై సమస్యల్ని ప్రస్తావించారు. గత సమావేశాల్లో తీసుకున్న తీర్మానాల్నీ అమలు చేయలేదని కొంతమంది సభ్యులు ప్రస్తావించారు. పెండింగ్ బిల్లుల్ని త్వరితగతిన క్లియర్ చేస్తామని అనిత స్పష్టం చేశారు. అదే విధంగా గంజాయి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల్ని ప్రోత్సహిస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలు, రోడ్ల అభివృద్ధిపై ఇటీవల కేంద్ర హెూంమంత్రి అమిత్ షాతోనూ చర్చించామన్నారు. సమగ్ర అభివృద్ధి ప్రణాళికా రూపకల్పనకు ఇక్కడి సభ్యులు సలహాలు, సూచనలు అందజేయొచ్చని ఆమె కోరారు