టాయిలెట్ల వినియోగ ఆవశ్యకతను అందరూ తెలుసుకోవాలి
బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కృషి చేయాలి
వరల్డ్ టాయిలెట్ల డే కార్య క్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
విశాఖపట్టణం(ఆనందపురం) OSG NEWS 19-11-2024
టాయిలెట్ల వినియోగం ఆవశ్యకతను తెలుసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. వరల్డ్ టాయిలెట్ల డేను పురస్కరించుకొని ఆనందపురం జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడి విద్యార్థులను ఉద్దేశించి పలు అంశాలపై ఉపదేశించారు. ప్రతి ఒక్కరూ టాయిలెట్లను వినియోగించాలని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. వినియోగించడానికి వెళ్లిన వారు విధిగా శుభ్రం చేయాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. బాల, బాలికలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి.. రోగాలు ప్రబలకుండా జాగ్రత్త పడాలని హితవు పలికారు. వ్యక్తిగత బాధ్యతగా భావిస్తూ టాయిలెట్ల శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులనుద్దేశించి పేర్కొన్నారు. గాంధీజి చెప్పినట్లు మార్పు మనతోనే ప్రారంభం కావాలని హితవు పలికారు. కేవలం ఈ ఒక్క వారంలోనే పరిశుభ్రత గురించి టాయిలెట్ల వినియోగం గురించి పట్టించుకొని మరళా మరిచిపోకూడదని పేర్కొన్నారు. బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని, ఎవరికైనా టాయిలెట్లు కావాలంటే స్థానిక అధికారుల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. 79 పంచాయతీల్లో కమ్యూనిటీ టాయిలెట్ల కాంప్లెక్సుల మరమ్మతులకు కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
జలవనరులను పొదుపుగా వాడుకోవాలి
జలవనరులను కాపాడుకోవాలని, రాయలసీమ లాంటి జిల్లాల్లో ప్రజలు తాగునీటిని ఎంత పొదుపుగా వాడుకుంటారో ఇక్కడి వారు తెలుసుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించాలని, వృథా చేయరాదని, వాడకం నీటిని కూడా పంటల సాగుకు, ఇతర అవసరాలకు వినియోగించాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటి పైపు కనెక్షన్ ఇస్తామని, దీనికి ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఆనందపురంలో ఇలాంటి ఆనందదాయక కార్యక్రమం నిర్వహించటం.. అందులో భాగస్వామ్యం కావటం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
మరింత మంది విజేతలు రావాలి…
ఆనందపురం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి చాలా మంది ఉత్తమ విద్యార్థులుగా ఎదగాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మనకు సమీపంలోనే.. మన గ్రామంలోనే స్కూల్ ఉంటే ఎంత మంచి జరుగుతుందో తనకు బాగా తెలుసునని.. తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి మరింత మంది విజేతలు వచ్చేందుకు ఇక్కడి వారి కృషి చాలా ఉందని గుర్తించాం.. వారికి జిల్లా యంత్రాంగం నుంచి మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో అసంపూర్తిగా ఉండిపోయిన భవన నిర్మాణ పనులు కొనసాగించేందుకు ఉన్నతస్థాయి అధికారులకు నివేదిస్తామని, నిధులు రప్పిస్తామని చెప్పారు. అలాగే జూనియర్ కళాశాల నిర్మాణానికి భూమి ఉన్నప్పటికీ పనులు ప్రారంభం కాలేదని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో డీపీవో శ్రీనివాసరావు, డీఈవో ప్రేమ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.