లక్ష సభ్యత్వాలు లక్ష్యం కావాలి
కార్యకర్తల పునాదులపై నిర్మించిన పార్టీ టీడీపీ
భీమిలి ఎమ్మెల్యే గంటా
OSG NEWS భీమిలి, అక్టోబర్ 26: భీమిలి నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా చేసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భీమిలి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో 1.76 లక్షల ఓట్లు వేసి ప్రత్యర్థి కంటే 92,401 ఓట్ల భారీ మెజారిటీ ఇచ్చి భీమిలి ప్రజలు చరిత్ర సృషించారని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదులో లక్ష మార్కును అందుకుని భీమిలి నియోజకవర్గం టీడీపీకి కంచుకోటని మరోసారి నిరూపించాలన్నారు. నిర్దేశించిన సమయానికంటే ముందుగానే లక్ష్యాన్ని చేరుకోవాలని, దీని కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. సభ్యత్వ నమోదు పురోగతిని ప్రతిరోజూ స్వయంగా సమీక్షిస్తానన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు సహా నియోజకవర్గంలోని పార్టీ పదవులు కూడా ప్రకటిస్తామని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కార్యకర్తలందరూ పునరంకితం కావాలన్నారు. పెన్షన్, హౌసింగ్ వంటి సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు పరిచయం చేసింది టీడీపీయేనని వివరించారు. క్షేత్ర స్థాయి కార్యకర్తల పునాదులపై బలోపేతమైన పార్టీ తమదని, ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నప్పటికీ సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని గంటా చెప్పారు. ఎన్నికల హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తూ ప్రజాభిమానాన్ని పొందుతున్నామన్నారు. విధ్వంసంతో పాలన మొదలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జాడ లేకుండా చేశారని విమర్శించారు. తప్పుడు కేసులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 53 రోజుల పాటు జైల్లో ఉంచినందుకు 11 సీట్లు మాత్రమే ఇచ్చి రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. మొబైల్ ద్వారా గంటా శ్రీనివాసరావు సభ్యత్వాన్ని నమోదు చేసుకుని సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పార్టీ నాయకులు కోరాడ రాజబాబు, గాడు వెంకటప్పడు, డి.ఎ.ఎన్.రాజు, కె.దామోదరరావు, కోరాడ రమణ, బి.ఆర్.బి.నాయుడు, గాడు అప్పలనాయుడు, తాట్రాజు అప్పారావు, వై. జీవన్ కుమార్, దాసరి శ్రీనివాస్, మొల్లి లక్ష్మణరావు, అక్కరమాని వెంకట్రావు, రాజు, చందక అప్పలరాజు, ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.