అర్జీలు వచ్చిన 48 గంటలలోపు ఓపెన్ చేసి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి.
అర్జీలు పునరావృతం కాకుండా అర్జీదారులతో అధికారులు స్వయంగా మాట్లాడాలి.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 211 విజ్ఞప్తులు
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్
విశాఖపట్నం OSG NEWS 02-12-2024
ప్రజా సమస్యల పరిష్కార వేదిక “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్” లో వచ్చిన అర్జీలను 48 గంటలలోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, ఆర్డీవో శ్రీలేఖ, జి వి ఎమ్ సి అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లాలో నలుమూలల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుంటూ, అర్జీలను స్వీకరిస్తూ, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సత్వర, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో స్వయంగా / ఫోన్ ద్వారా గాని మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలని, అందువల్ల ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కు అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లాకు సంబంధించి వచ్చిన అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
అధికారులతో సమీక్ష సమావేశం
ముందుగా అధికారులతో జిల్లాకలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 9703 అర్జీలు స్వీకరించడం జరిగిందని, అందులో 7723 అర్జీలు (79%) పరిష్కరించడం జరిగిందన్నారు. మిగిలిన అర్జీలు పది రోజుల లోపు నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ/మండల స్థాయిలో అర్జీలను ఎటువంటి పొరపాట్లకు తావులేని విధంగా సిబ్బంది పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అందువల్ల అర్జీదారులు జిల్లా స్థాయి వరకు రాకుండా ఉంటారన్నారు. జిల్లా అధికారులు సంబంధిత శాఖల నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని, కావున ప్రతి అర్జీ స్వయంగా ఆడిట్ చేసి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. జిల్లాలో వివిధ శాఖల లక్ష్య సాధనలో 100 రోజులు యాక్షన్ ప్లాన్ మరియు 5 సంవత్సరాల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 211 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 78 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీ సంబంధించి 60 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 58 వినతులు వచ్చాయి.
వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు