ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
రైతులకు గంటా భరోసా
ఆనందపురం OSG NEWS 26-11-2024
రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆనందపురం మండలం బోని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రైతు అంటే అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లో చనిపోయే వాడనే నానుడిని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుందని చెప్పారు. రైతు కుటుంబంలో పుట్టిన తనకు వారి కష్టాలు తెలుసన్నారు. టన్నుకి రూ.2,300 మద్దతు ధర ఇస్తున్నప్పటికీ, రైతు నిర్ణయించుకున్న మిల్లుకు ధాన్యం తరలించుకోవాలని భావిస్తే గన్నీలు, రవాణా, హమాలీల ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. రైతు బాగు కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందిన బోని అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని 3 మండలాల్లో 8 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. బోని ఇనాం భూముల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకు వెళ్లానని, త్వరలోనే దానికి పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ మాట్లాడుతూ రైతుల ధాన్యం తరలించడానికి 50 వేల గన్నీలు, 100 వాహనాలు సిద్ధం చేశామని, ప్రభుత్వం ప్రకటించిన రూ. 2,300 మద్దతు ధర కంటే తక్కువకు రైతులెవరూ బయట అమ్ముకోవద్దని సూచించారు, ఆర్డీఓ సంగీత్ మాధుర్, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.