పిల్లల బంగారు భవిష్యత్తు కోసం – బడి వైపు ఒక అడుగు
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల చదువులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
డిసెంబర్ 7 న జరుగు మెగా పేరెంట్-టీచర్స్ సమావేశాలు విజయవంతం చేయాలి.
కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్.
విశాఖపట్నం OSG NEWS 26-11-2024
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం – బడి వైపు ఒక అడుగు అనే నినాదంతో నిర్వహించ తలపెట్టిన మెగా పేరెంట్-టీచర్స్ సమావేశాలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. పాఠశాలకు, తల్లిదండ్రులకు మరియు సమాజానికి మధ్య పటిష్టమైన, సుసంపన్నమైన, సుహృద్భావ బంధాన్ని సమర్ధవంతంగా ఏర్పరచడానికి తల్లిదండ్రుల, ఉపాధ్యాయ సమావేశాల నిర్వహణ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో డిసెంబర్ 7 వ తేదీన మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖ జిల్లాలో 11 మండలాల పరిధిలోని ఉన్న 595 ప్రభుత్వ పాటశాలలలో పీ.టి.ఎం సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 7 న జరుగు మెగా పేరెంట్-టీచర్స్ సమావేశం పై జిల్లా విద్యాశాఖ అధికారులతో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోసమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా పాఠశాలలు, తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. పిల్లల అకడమిక్ మరియు ఎక్స్‌ట్రా కరిక్యులర్‌లను ప్రదర్శించడానికి, తల్లిదండ్రులకు విద్యార్థి పురోగతి, పాఠశాల సవాళ్లకు వినూత్న పరిష్కారాలను కనుగొనడానికి తల్లిదండ్రులతో సహకరించడం ద్వారా పిల్లల చదువులు ఉన్నతికి అవకాశం ఉందని తెలిపారు. పాఠశాలలో హాజరు నమోదు, మౌలిక సదుపాయాలను సమీక్షించడం, పాఠశాల అభివృద్ధికి సహకరించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని అన్నారు. పోషకాహారం, పిల్లల భద్రత అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన చేయడం జరుగునని వివరించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు అందుబాటులో ఉన్న పాఠశాల సౌకర్యాలపై అవగాహన కల్పించడం ద్వారా వారికి పాటశాల పట్ల భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యా విధానం మెరుగుపరిచే లక్ష్యంతో ఉన్న రాష్ట్ర విధానాల గురించి తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగునన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కొరకు ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, దీనికోసం ప్రతిరోజు తరగతి గదిలో ప్రార్థన సమయంలో విద్యార్థులకు వివరించాలని అన్నారు. ఈ మెగా పేరెంట్ టీచర్ సమావేశం కొరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను కూడా ప్రమేయం కల్పించాలని తెలిపారు. మెగా పేరెంట్ టీచర్ సమావేశం జరుగు రోజునకు ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాల యొక్క సాధించిన విజయాలు, అకాడమిక్ వివరాలు, అడ్మిషన్లు మొదలగునవి సిద్ధం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు.
విద్యార్థుల తల్లితండ్రులకు అవగాహన కల్పించాలి:-
ప్రభుత్వ పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పిస్తున్నారని, వారికి వారి పిల్లల చదువుల పట్ల సరైన అవగాహన లేనందున , ఈ సమావేశం ద్వారా పిల్లల చదువులు, వారి అలవాట్లు పట్ల ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున జరుగుతున్న అన్ని కార్యక్రమాలను ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లితండ్రులకు వివరించాలని తెలిపారు.ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి యొక్క ప్రవర్తన, చెడు అలవాట్లు, పిల్లల యొక్క హాజరు తదితర విషయాలను గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లితండ్రులు తప్పక హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్, ఉప విద్యాశాఖ అధికారి సోమేశ్వరరావు, ఎం.ఈ.వోలు పలువురు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.