OSG NEWE సోమవారం 20-01-2025
*పునరావృతం అయిన అర్జీల పై అధికారులదే బాధ్యత.*
*అర్జీలు వచ్చిన 24 గంటల లోపు ఓపెన్ చేసి విచారణ చేపట్టి పునరావృతం కాని విధంగా అధికారులు పరిష్క రించాలి.*
*ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో 237 విజ్ఞప్తులు*
*జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్*
విశాఖపట్నం
ప్రజా సమస్యల పరిష్కార వేదిక “పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్” లో వచ్చిన అర్జీలను 24 గంటలలోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా సంతృప్తి కరమైన, నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా కలెక్టర్ జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారుల సమస్యలను వింటూ, అర్జీలను స్వీకరిస్తూ, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి శాశ్వత పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జి వి ఎమ్ సి అడిషనల్ కమిషనర్ వర్మ వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి విచ్చేసిన అర్జీదారుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా సత్వర, శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులు తప్పకుండా అర్జీదారులతో మాట్లాడి, సమస్య పూర్వాపరాలు తెలుసుకొని సరైన పరిష్కారం చూపాలని, అందువల్ల అర్జీలు పునరావృతం కాకుండా ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
*అధికారులతో సమీక్ష సమావేశం*
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభానికి ముందుగా అధికారులతో జిల్లాకలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ నకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందన్నారు. సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చే అర్జీలను జిల్లాస్థాయి అధికారులు అత్యంత ప్రాధాన్యతతో తక్షణమే అర్జీదారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో అధికంగా 165 రీ-ఓపెన్ అర్జీలు రావడం పట్ల అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి ఖచ్చితమైన సమాచారాన్ని అందించి, ఎటువంటి పొరపాట్లకు తావులేని విధంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అర్జీ పునరావృతం అయ్యిందంటే జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
*జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన జిల్లా కలెక్టర్*
జిల్లాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పర్యటనను, ఈనెల 18 మరియు 19 తేదీలలో సౌత్ జోన్-2 జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ లను నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించి విజయవంతం చేసిన జిల్లా అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు.
సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 237 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 76 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీ సంబంధించి 65 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 81 వినతులు వచ్చాయి.
వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు
జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్నం