- *భారతదేశ ఉక్కు మనిషికి నివాళులు*
OSG NEWS 31-10-2024
భారత రత్న, ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా భీమిలి లోని వాల్ ఆఫ్ ఇండియన్ ఐకాన్స్ వద్ద మిషన్ గ్రీన్ భీమిలి మరియు ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి (ఫాబ్) సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుల్లల వెంకటేష్ మాట్లాడుతూ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారతదేశ మొదటి హోం మంత్రి మరియు ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారని, స్వతంత్రం వచ్చిన తరువాత అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనం అవడంలో ఆయనది కీలక పాత్ర అని చెప్పారు. అలాగే భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ తన వంతు సహకారాన్ని అందించారని, డా. అంబేద్కర్ ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించడంలో కూడా ఆయన ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు. ముసునూరి సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ వాల్ ఆఫ్ ఇండియన్ ఐకాన్స్ వద్ద ఈ నెల ముగ్గురు మహానుభావులను స్మరించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని అందరి సహకారంతో నిరంతరాయంగా నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పారు. ముమ్మిడిశెట్టి ఆదిత్య మాట్లాడుతూ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్ గా దేశ వ్యాప్తంగా జరుపుకోవడమే ఆ మహానుభావునికి మనం అందించే గొప్ప నివాళి అని అన్నారు. దేశం కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన ఇలాంటి మహానుభావులను స్మరిచుకోవడానికే ఈ వాల్ ఆఫ్ ఇండియన్ ఐకాన్స్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ గ్రీన్ భీమిలి సభ్యులు మరియు ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి (ఫాబ్) సభ్యులు పాల్గొన్నారు.