OSG NEWS

జెట్ స్పీడ్ లో ఆంధ్రా అభివృద్ధి

తరలిపోయిన పెట్టుబడులు తిరిగి వస్తున్నాయ్

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం OSG NEWS 01.11.2024

అయిదేళ్ల వైసీపీ పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అయిదు నెలల్లో జెట్ స్పీడ్ లో అభివృద్ధి దిశగా తీసుకు వెళ్తున్నారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం ఎం.వి.పి. కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కు వచ్చే నెలలో శంకుస్థాపన జరగనుందని, గత ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్ కార్యాలయానికి కనీసం స్థలాన్ని సైతం కేటాయించలేదని విమర్శించారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో రూ.75 వేల కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని, అమరావతి పనుల కోసం మొదటిదశలో రూ.28,250 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. పోలవరాన్ని రెండేళ్లలో పూర్తి చేసేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారని చెప్పారు. జగన్ వల్ల రాష్ట్రం నుంచి తరలిపోయిన లులు గ్రూప్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి అనేక పెట్టుబడులు తిరిగి వస్తున్నాయన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టుకు సమాంతర రోడ్లు, ఫ్లయ్ ఓవర్లు

2026 జూన్ నుంచి అందుబాటులోకి రానున్న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జిలు సమాంతరంగా నిర్మించాల్సి ఉందని గంటా తెలిపారు. ఈ విషయాన్ని శనివారం నగరానికి రానున్న సీఎం చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి పి.నారాయణ దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. మెట్రో నిర్మాణ ప్రతిపాదనలు కూడా ఆ సమయానికి ఒక కొలిక్కి తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖలో 10 వేల మందికి ఉపాధి కలిగించేలా టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రూ.70 వేల కోట్లతో 73 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నక్కపల్లి సమీపంలోని రాజయ్యపేటలో ఆర్సెలాల్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ (జపాన్) సంయుక్త భాగస్వామ్యంలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ మొదటిదశ 2029 కి పూర్తవుతుందని, ఈ ప్లాంట్ 20 వేల మందికి ఉపాధి కలిగించనుందని తెలిపారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే విశాఖపట్నం ముఖచిత్రం మారిపోతుందని తెలిపాను.

కేసుల్లో పూలన్ దేవి లాంటి వారితో పోటీ పడుతున్న జగన్

47 కేసులతో పూలన్ దేవి లాంటి వారితో జగన్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందు ముందు 2004లో కేవలం రూ.10 లక్షల ఐటీ రిటర్న్ లు వేసిన జగన్ 2009 నాటికి రూ.379 కోట్ల రిటర్న్ దాఖలు చేసే స్థాయికి ఏవిధంగా వెళ్లారని నిలదీశారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి తన సొంత అవసరాలకు తప్ప వేరే దానికి వాడే అవకాశం లేకుండా రుషికొండ ప్యాలెస్ ను డిజైన్ చేసుకున్నారని ధ్వజమెత్తారు. రుషికొండ ప్యాలెస్ దేనికి వాడాలనేది ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.

జగన్ కు రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదు

ఆస్తుల కోసం తల్లి, చెల్లిపై కోర్టులో కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి నైజం తల్లి వై.ఎస్.విజయమ్మ లేఖతో బహిర్గతమైందని తెలిపారు. రాజకీయంగా విభేదించిందనే అక్కసుతో, అంతకు ముందు రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేస్తానని చెల్లిని బెదిరించడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. శుభలేఖ ఇవ్వడానికి షర్మిల పసుపు చీర కట్టుకుని వెళ్లడంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు శోచనీయమని తెలిపారు. వైసీపీ పూర్తిగా మునిగిపోయిన పడవ అని, బాలినేని, మోపిదేవి వంటి సీనియర్ నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయడమే తార్కాణమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలో నడిపించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. జనసేన భీమిలి ఇంచార్జీ పంచకర్ల సందీప్, టీడీపీ నాయకులు కోరాడ రాజబాబు, కార్పొరేటర్లు పి.వి.నరసింహం, నొడగల అప్పారావు, రామవరం సర్పంచ్ రాజు, జనసేన నాయకుడు శాఖారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *