జిల్లా యంత్రాగం అప్రమత్తంగా ఉండాలి
వరి పండించే రైతులను అప్రమత్తం చేయాలి
జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్
అనకాపల్లి, OSG NEWS 26-11-2024: వాతావరణశాఖ సూచనల మేరకు రానున్న రెండు,మూడు రోజులలో భారీవర్షాలు పడే అవకాశముందని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరు కార్యాలయం నుండి వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ వరికోతలు కోసిన రైతులను తమ పంటను వెంటనే ఎత్తయిన ప్రాంతాలను తరలించేలా అప్రమత్తం చేయాలని తెలిపారు. పంట తడవకుండా టార్పాలిన్లు సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లాలో 56410 హెక్టార్లులో వరి పంటవేయగా 6555 హెక్టార్లలో కోతలు జరిగాయని, 5620 హెక్టార్లలో పంటను కుప్పలు పెట్టగా, ఇంకా 900 హెక్టార్లలోని పంట పొలంలో ఉందని అధికారులు తెలియజేయగా, పొలాలలోని పంటను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, రైతులను అప్రమత్తం చేయాలని తెలిపారు. వరిపంట వేసిన రైతుల పూర్తి సమాచారం రేపు ఉదయానికల్లా సేకరించి అందజేయాలని వ్యవసాయఅధికారులను ఆదేశించారు. ఒక్క ఎకరా పంట కూడా పాడవకూడదన్నారు.
వర్షాలు మూలంగా నీరుకలుషితం కాకుండా పంచాయతీ మునిషిపల్ అదికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పైపులు లీకేజీలు లేకుండా చూడాలని, మంచినీటి ట్యాంకులలో ముందుగానే నీటిని నింపుకోవాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన మందులు నిల్వచేసుకోవాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. నీటిపారుదల శాఖ అదికారులు రిజర్వాయర్లలో నీటి మట్టాలను పరిశీలిస్తుండాలని, గేట్లు సక్రమగా పనిచేస్తున్నది లేనిది తనిఖీచేసుకోవాలని, రిజర్వాయర్లలో నీటి మట్టాలు పెరిగితే దిగువప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. నదీ పరివాహన ప్రాంతాలు, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. నదులు, కాలువల గట్లకు గండ్లు పడే అవకాశం ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు. మత్సకారులకు తగు సూచనలు అందజేయాలని రెవిన్యూ, మత్స్యశాఖ అధికారులకు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బి. మోహనరావు, వ్యవసాయ అదికారులు పాల్గొన్నారు.