డయేరియాతో అస్వస్థులై విజయనగరం జిల్లా గుర్లలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం, డయేరియాతో చనిపోయిన వారి కుటుంబాలను కలిసి, వారిని కూడా పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి.
మీడియాతో శ్రీ వైయస్ జగన్. ముఖ్యాంశాలు:
– ఈరోజు గుర్ల గ్రామం, మండలంలో ప్రత్యేక పరిస్థితులు చూసి, గమనిస్తే, చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు కళ్లెదుటే కనిపిస్తాయి.
– మా ప్రభుత్వ హయాంలో గ్రామ స్వరాజ్యం తీసుకొస్తే, ఆ గ్రామ స్వరాజ్యం ద్వారా గ్రామాలన్నీ సస్యశ్యామలంగా ఉంటే, ఈరోజు పరిస్థితి ఏమిటన్నది గమనించండి.
– నాడు వైయస్సార్సీపీ హయాంలో గ్రామాలు చూస్తే.. ప్రతి గ్రామంలో సచివాలయాలు కనిపించేవి. అక్కడే వివిధ శాఖల వారు పని చేస్తూ కనిపించే ఉద్యోగులు ఉండేవారు. బడి పిల్లలు చక్కగా నవ్వుతూ కనిపించేవారు.
– మన గ్రామంలో డిజిటల్ లైబ్రరీలు కనిపించేవి. సచివాలయాల్లో పంచాయతీరాజ్ శాఖలో పని చేసే వాళ్లు కనిపించే వాళ్లు. అక్కడే విద్యా శాఖ చూసే వాళ్లు కూడా కనిపించేవారు.
– ఈరోజు గుర్ల మండలం, గ్రామంలో జరిగింది ప్రజలంతా గమనించమని కోరుతున్నాను. రాష్ట్రంలో పరిస్థితి గమనించమని కోరుతున్నాను.
– గతంలో గ్రామ సచివాలయంలో పంచాయతీరాజ్, విద్యా శాఖ, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఏఎన్ఎం, అగ్రికల్చర్, సర్వే, ప«శు సంవర్థకశాఖ సిబ్బంది కనిపించేవారు.
– నాలుగు అడుగులు వేస్తే, విలేజ్ క్లినిక్స్ కనిపించేవి. అక్కడే రోజంతా, వారంలో ఏడు రోజుల పాటు, అక్కడే నివాసం ఉండే సీహెచ్‌ఓలు కనిపించేవారు, వారికి అనుసంధానంగా ఏఎన్ఎంలు, వారికి రిపోర్ట్ చేస్తూ ఆశా వర్కర్లు కనిపించేవారు.
– విలేజ్ క్లినిక్స్‌తో పాటు, ఒక పటిష్టమైన వ్యవస్థ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నడిచేది. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌ను అనుసంధానం చేసి, పీహెచ్‌సీల్లో డాక్టర్ల సంఖ్యను పెంచి, ప్రతి గ్రామానికి 15 రోజులకు డాక్టర్లు వచ్చే వ్యవస్థ.
– అదే గ్రామంలో నాడు–నేడుతో బాగుపడిన స్కూళ్లు. రైతన్నలను చేయి పట్టించుకుని నడిపించే వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు కనిపించేవి.
చక్కగా ఈ–క్రాపింగ్ జరిగేది. రైతులకు ఉచిత పంటల బీమా అందేది. రైతులకు సకాలంలో పెట్టుబడి సహాయం అందేది.
– ఈరోజు గ్రామ స్వరాజ్యం ఎలా తయారైంది అని చెప్పడానికి గుర్ల గ్రామం ఒక ఉదాహరణ.
– ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏకంగా 14 మంది చనిపోయిన పరిస్థితి. నీరు బాగాలేక, డయేరియా వచ్చి చనిపోయారు.
– ఇదే గ్రామానికి సంబంధించి, జగన్ అనే వ్యక్తి అక్టోబరు 19న ట్వీట్ చేస్తే తప్ప, ఇక్కడ 14 మంది చనిపోయారని చెప్పని పరిస్థితి.
– ఇదే గ్రామంలో సెప్టెంబరు 20వ తారీఖున, అంటే 35 రోజుల కిందట, ఇదే మండలంలోని పెనుబర్తిలో ఒక వ్యక్తి చనిపోయాడు. తొలి డయేరియా కేసు నమోదైంది. అయినా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఎవరూ స్పందించని పరిస్థితి.
– అక్టోబరు 12 వచ్చేసరికి డయేరియా మరింత విజృంభించింది. గుర్ల, కోట గుండ్రేడు, గోషాడ, నగలవలస గ్రామంలో డయేరియా ఉధృతంగా ప్రబలింది.
– డయేరియా వల్ల ఏకంగా 14 మంది చనిపోయారు.
– అక్టోబరు 19న జగన్ ట్వీట్ చేస్తే తప్ప, ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ తర్వాత ప్రభుత్వం కదిలిందా? అంటే అదీ లేదు.
– కలెక్టర్ అంటాడు కేవలం ఒకరే చనిపోయాడని. అలా దీన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. మంత్రులు, అధికారులు ఆ ప్రయత్నం చేశారు. ఎవరూ డయేరియాతో చనిపోలేదని చెప్పే కార్యక్రమం చేశారు.
– తీరా చూస్తే, అక్టోబరు 24 వచ్చేసరికి చూస్తే, 14 మంది చనిపోయారని తేలింది.
– ఇష్యూ పెద్దది కావడంతో, సీఎం చంద్రబాబు కూడా ఒప్పుకోక తప్పలేదు. ఇక్కడ డయేరియాతో 8 మంది చనిపోయారని చెప్పారు.
– ఇక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎం 10 మంది చనిపోయారని చెప్పారు.
తీరా, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలకు కనీసం క్షమాపణ చెప్పి, జరిగిన తప్పును సరిదిద్దడం లేదు.
ఇక్కడ జరిగిన తప్పు గమనిస్తే..
– పక్కనే చంపానది ఉంది. దాంట్లో నీళ్లు దారుణ పరిస్థితిలో ఉన్నాయి.
చంపానది మీద ఈ మండలానికి సంబంధించి సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం (సీపీడబ్ల్యూఎస్).. చంద్రబాబు వచ్చిన తర్వాత, ఈ 5 నెలల్లో కనీసం మెయింటెనన్స్ రెన్యూవల్ కూడా చేయలేదు.
– దాని ఫిల్టర్లు మార్చారా? లేదా? కనీసం క్లోరినేషన్ జరిగిందా? అన్న కనీసం ఆలోచన కూడా చేయలేదు.
– శానిటేషన్ లేదు. గ్రామంలో సచివాలయం ఉంది. వారి సహాయ, సహకారంతో గ్రామంలో శానిటేషన్ చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు.
– ఈ మండలానికి సంబంధించి 345 మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో అంత కంటే ఎక్కువగా దాదాపు 450 మంది చికిత్స పొందుతున్నారు.
– ఇప్పటికీ విజయనగరం జిల్లాలో గరివిడి, గజపతినగరం, దత్తిరాజేరు మండలాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇంకా 62 మంది చికిత్స పొందుతున్నారు.
– ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే, ప్రభుత్వం ఏం చేస్తోంది? కనీసం ప్రజలను పట్టించుకోవడం లేదు.
– ఏదైనా ఇష్యూ జరిగితే, ఆ ఇష్యూను ఎలా డైవర్ట్ చేయాలి? ఎలా కవరప్ చేయాలి? అది అసలు జరగనట్లు ఎలా చూపించాలి? అన్న దిక్కుమాలిన ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తల దించుకోవాలి.
– ఇది గుర్ల మండల కేంద్రం. ఇక్కడే 9 మంది చనిపోగా, మండలంలో మొత్తం 14 మంది చనిపోయారు.
– ఇక్కడి నుంచి జిల్లా కేంద్రం కేవలం 17 కి.మీ దూరంలో ఉంది. మరి ఇక్కడి వారిని ఎందుకు విజయనగరం తీసుకోలేకపోయారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం కేవలం 80 కి.మీ దూరంలో ఉంది.
– ఒక 10 అంబులెన్సులు ఏర్పాటు చేసి, డయేరియా బారిన పడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఎందుకు తీసుకుపోలేదు?
– నాడు–నేడు మనబడి కార్యక్రమంలో బాగు చేసిన స్కూళ్లలో డయేరియా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేశారు. బెంచీలపై వారిని పడుకోబెట్టారు. అంటే స్కూళ్లలో వైద్యం చేసే పరిస్థితి.
– ఇక్కడ మా ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది.
17 కి.మీ దూరంలోని విజయనగరం, 80 కి.మీ దూరంలో ఉన్న విశాఖపట్నంకు రోగులను తరలించక పోవడంతో, గ్రామంలో 9 మంది, మండలంలో 14 మంది చనిపోయారు. ఇది దారుణం.
– మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా?
– చివరికి వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కూడా అందలేదు. అదే విషయం వారంతా చెప్పారు.
– సహాయం చేయకపోగా, ఆస్పత్రులకు పోతే.. డయేరియాతో చనిపోయారని చెప్పొద్దని, అలా చెబితే గ్రామంలో దాని వల్ల భయాందోళన పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల గుండెపోటుతో చనిపోయారని చెప్పమని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
– ప్రభుత్వం అలా చెప్పమని చెబుతోంది అంటే, ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో ఆలోచన చేయమని కోరుతున్నాను.
– ఇక్కడి గ్రామాల్లో పరిస్థితి బాగుపర్చకపోగా, విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలను బాగు పర్చకపోగా, సీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసేశారు. వైద్య శాఖలో జీరో వెకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే, దాన్ని రద్దు చేశారు.
– ఆరోగ్యశ్రీ బకాయిలు మార్చి నుంచి కట్టడం లేదు. దాంతో దాదాపు రూ.1800 కోట్లు బకాయిలు పేరుకుపోయి, రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు పోలేని పరిస్థితి.
– మెరుగైన వైద్యం అందేలా మా ప్రభుత్వం ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో 5 కాలేజీలను గత ఏడాది ప్రారంభించాం.
– మిగిలిన 12 మెడికల్ కాలేజీల్లో పూర్తి చేసి, వాటిని కూడా నడపాల్సిన ప్రభుత్వం.. వాటిలో 5 కాలేజీల్లో సీట్లు కూడా మంజూరైతే, వాటిని నిర్వహించలేమని లేఖ రాసింది.
– ఆ తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలతో పాటు, గత ఏడాది మొదలైన 5 మెడికల్ కాలేజీలు.. మొత్తం 17 మెడికల్ కాలేజీలను తమకు అనుకూలమైన వారికి అమ్మేయడానికి, స్కామ్వైపు అడుగులు వేస్తోంది.
– ఆరోగ్యశ్రీని నీరు గార్చారు. గతంలో కేవలం 1000 ప్రొసీజర్లకు మాత్రమే పథకాన్ని పరిమితం చేస్తే, మా ప్రభుత్వం వచ్చాక, 3300 ప్రొసీజర్లకు తీసుకుపోయాం. ఇంకా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేసే ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
– ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో పాటు, ఆరోగ్య ఆసరాను çపూర్తిగా నీరుగార్చిన పరిస్థితి కనిపిస్తోంది.
– మేము విపక్షంలో ఉన్నా, పార్టీ నుంచి ఆదుకుంటాం. డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తాం.
– ప్రతిపక్షంలో ఉన్నా మేమే ముందుకు వచ్చాం. అధికారంలో ఉన్న మీకు మరింత బాధ్యత ఉంటుంది. మరి మీరు ఎంత ఇవ్వబోతున్నారో చెప్పండి. సూటిగా ప్రశ్నిస్తున్నాం.
– ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి, వాస్తవాలను ప్రజలతో పంచుకుని, వారికి క్షమాపణలు చెప్పి, వారికి సహాయం చేసేందుకు అడుగులు ముందుకు వేయాలి.
– ఇకనైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని పైన ఉన్న దేవుడిని ప్రార్థిస్తున్నాను.
– ప్రతి అడుగులో ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స చేస్తోంది. ఏదైనా ఇష్యూ వస్తే, దానిపై స్పందించాల్సి వస్తే, ప్రభుత్వం స్పందించకపోగా, ఇష్యూను డైవర్ట్ చేసేలా అడుగులు వేస్తోంది.
– ఈ ప్రభుత్వం తీరుపై మేము ఢిల్లీలో ధర్నా చేస్తే, ఆరోజు మదనపల్లెలో ఏదో అగ్నిప్రమాదం జరిగితే, ఏకంగా హెలికాప్టర్లో డీజీపీని, అధికారులను పంపారు.
– అదే ఇక్కడ 14 మంది చనిపోతే, హెలికాప్టర్ కాదు కదా.. కనీసం మంత్రులు కూడా వచ్చి పలకరించలేదు.
– ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఎన్నికల ముందు సూపర్‌సిక్స్ అన్నారు.
– ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి.. చిన్న పిల్లలు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లో పిల్లల పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు, నీకు రూ.48 వేలు అని, ఇంకా ఆ ఇంట్లో 20 ఏళ్ల వయసున్న వారు కనబడితే నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని, ఆ ఇంట్లో ఎవరైనా కండువా వేసుకున్న రైతు కనిపిస్తే నీకు రూ.20 వేలు, నీకు రూ.20 వేలు అని చెప్పి నమ్మించి మోసం చేశారు.
100 రోజుల పాలన మీద ప్రజలు ఇవన్నీ నిలదీస్తారని చెప్పి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. తిరుపతి లడ్డూపై ప్రచారం చేశారు.
– ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రజలకు అండగా నిలబడాల్సి ప్రతి సందర్భంలోనూ, చంద్రబాబుగారు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
ప్రతి దాంట్లోనూ డైవర్షన్. అదే చంద్రబాబు రాజకీయం.
– ఈరోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు. రాష్ట్రవ్యాప్తంగా అక్కచెల్లెమ్మల జీవితాలు చెల్లాచెదురు అవుతున్నాయి. చిన్న పిల్లల జీవితాలు చెల్లాచెదురవుతున్నాయి. శాంతి భద్రతలు కుదేలైపోయాయి.
– ప్రభుత్వం మాది అని చెప్పి, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు విచ్చలవిడిగా అక్కచెల్లెమ్మల మీద దాడులు చేస్తున్నారు. చిన్న పిల్లల మీద దాడులు చేస్తున్నారు.
– మరోవైపు జగన్ అనే వ్యక్తి పర్యటిస్తున్నాడు. గుంటూరు వస్తున్నాడు. గుర్లకు వస్తున్నాడు అనేసరికి, మళ్లీ టాపిక్ డైవర్ట్.
అలా టాపిక్ డైవర్ట్ చేసి ఏమంటారు?
– మా చెల్లెలు ఫోటో పెడతారు. మా అమ్మ ఫోటో పెడతారు. అయ్యా చంద్రబాబు, అయ్యా రాధాకృష్ణ. అయ్యా ఆంధ్రజ్యోతి. అయ్యా ఈనాడు. అయ్యా టీవీ5. మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నాను. మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు ఏం లేవా? అని అడుగుతున్నాను.
– అయ్యా, ఇవన్నీ ఘర్ ఘర్కీ కహానీలు. ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే. వీటని మీ స్వార్థం కోసం వీటిని పెద్దవి చేసి చూపడం, నిజాలను వక్రీకరించి చూపడం.
– ఇవన్నీ మానుకుని ప్రజల మీద ధ్యాస పెట్టండి. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని ఈరోజు చంద్రబాబును అడుగుతున్నాను.