ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన హోంమంత్రి అనిత
రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ
OSG NEWS 29-10-2024
పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై చొరవ చూపాలని హోంమంత్రి వినతి
అమరావతి, అక్టోబర్, 29; రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ .. ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా 185 అగ్నిమాపక స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా.. సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. 100 లేదా 101 నంబర్లకు ఫోన్ లు చేసి టపాకాయల అక్రమ తయారీపై పోలీస్, ఫైర్ వ్యవస్థలకు ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామం తరహా దీపావళి టపాకాయల పేలుడు ఘటనలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు తెలిపారు. వాయు కాలుష్యం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలో దీపావళిలో గ్రీన్ క్రాకర్స్ వినియోగించేలా అవగాహన కలిగించాలని ఉపముఖ్యమంత్రి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకటించిన ‘దియాజలావ్’ కార్యక్రమం తరహాలో ఏపీలోనూ ప్రజలను చైతన్యపరచాలని చెప్పినట్లు హోంమంత్రి తెలిపారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాకు సంబంధించి తాజా పరిస్థితులపై ఉపముఖ్యమంత్రి ఆరా తీశారన్నారు. ప్రస్తుతం డయేరియా కేసుల నమోదు తగ్గిందని పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు హోంమంత్రి ఆయనకు వివరించారు. ఇటీవల రాష్ట్రంలో తిరుపతి, విశాఖ విమానాశ్రయాలలో బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన రాష్ట్రంలోని అరాచక పరిస్థితులు ఇటీవల బయటికి వస్తున్న దుర్మార్గాలపై చట్టప్రకారం వేగంగా దర్యాప్తు చేసి, నిందితులను శిక్షించేలా చూడాలని పవన్ కళ్యాణ్ మార్గనిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహించిన తీరు పట్ల డిప్యూటీ సీఎం హోంశాఖను ప్రశంసించారు. నేరాల నియంత్రణలో మొబైల్ ఫోన్ వినియోగించాలంటూ హోంమంత్రి ప్రజల భాగస్వామ్యం కోరడాన్ని ఆయన అభినందించారు. డ్రగ్స్, గంజాయి,సైబర్ నేరాల పట్ల గతంలో లేని విధంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై చొరవ చూపాలని హోంమంత్రి వినతి
హోం మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి హోంమంత్రి వంగలపూడి అనిత తీసుకెళ్లారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో లింగాపురం నుంచి కొడవటిపూడి కట్ట వరకు సుమారు కి.మీ మేర నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు ఇప్పించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. పాయకరావుపేటలోని వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తికి చొరవ చూపాలని డిప్యూటీ సీఎంకు వినతి పత్రం సమర్పించారు. తన నియోజకవర్గంలోని పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం సహా ముఖ్యమైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రాధాన్యతను పవన్ కళ్యాణ్ కు వివరించి వాటి సత్వర పూర్తికి సహకరించాలని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.