రేషన్ సరుకులను దారి మళ్లించే వారిపై నిఘా ఉంచాలి
అవకతకలకు పాల్పడిన వారిపై 6ఏ కేసులు నమోదు చేయాలి
పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించిన జేసీ కె. మయూర్ అశోక్
విశాఖపట్టణం OSG NEWS 25.10.2024
రేసన్ దుకాణాల్లో, ఎం.ఎల్.ఎస్. (నిల్వ కేంద్రాలు) పాయింట్లలో విస్తృత తనిఖీలు చేపట్టాలని అవకతవకలకు పాల్పడిన వారిపై 6ఏ కేసులు నమోదు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను, తనిఖీ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. రేషన్ సరుకులు దుర్వినియోగం కాకుండా చూడాలని, దారి మళ్లించే వారిపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని పేర్కొన్నారు. కలెక్టరేట్ మీటింగు హాలులో శుక్రవారం ఉదయం ఆయన పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు, తనిఖీ సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రేషన్ సరుకుల పంపిణీ, దుకాణాల నిర్వహణ, ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ అందజేత, తనిఖీలు, కేసుల నమోదు తదితర అంశాలపై సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో బినామీల పేర్లపై కొంతమంది దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, రేషన్ సరుకులు కూడా సమీపంలో ఉన్న హోల్ సేల్ దుకాణాలకు తరలిపోతున్నట్లు పలు పత్రికల్లో ప్రతికూల కథనాలు వస్తున్నాయని దీనిపై కింది స్థాయి అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేషన్ దుకాణాలు, ఎం.ఎల్.ఎస్. పాయింట్లలో విస్తృత తనిఖీలు చేపట్టాలని వాస్తవ పరిస్థితులపై నివేదిక అందించాలని ఆదేశించారు. హోల్ సేల్ దుకాణాలపై బృందాలుగా వెళ్లి దాడులు చేయాలని సూచించారు. రాత్రి పూట కూడా తనిఖీలు చేపట్టాలని, ఎక్కడైనా తప్పు జరిగినట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలని సంబంధిత అధికారులకు చెప్పారు. రబ్బర్ స్టాంపుల వినియోగంలో కూడా అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని దీనిపై కూడా దృష్టి సారించాలన్నారు. పక్కాగా తూనికలు చేపట్టిన తర్వాత మాత్రమే గోదాముల నుంచి ఎం.ఎల్.ఎస్. పాయింట్లకు సరుకులు సరఫరా చేయాలని ఆదేశించారు. ఎండీయూ వాహనాలు ఉదయం 7.00 గంటల నుంచే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇంటింటికీ వెళ్లి బియ్యంతో పాటు మిగిలిన సరుకులు కూడా పక్కాగా అందజేయాలని ఆదేశించారు.
సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం శ్రీలత, జిల్లా సహాయక పౌర సరఫరాల అధికారి కల్యాణి, ఇతర ఏఎస్వోలు, సీనియర్ తనిఖీ అధికారులు, జూనియర్ తనిఖీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.