విశాఖపట్నం: ఈరోజు జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంటు అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించి, న్యాయం చేయాలని ఓ సభ్యుడు విన్నవించగా, విశాఖ ఎంపీ శ్రీభరత్ సానుకూలంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రం నుండి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయని గుర్తుచేశారు. గత నాలుగు నెలల కాలంలో రూ.500 కోట్లు ఒకసారి, రూ.1,200 కోట్లు మరోసారి మొత్తంగా రూ.1,700 కోట్లు వివిధ అవసరాల నిమిత్తం విడుదలయ్యాయని తెలిపారు. ఈ నిధుల విడుదల ద్వారా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంటు పై తీసుకుంటున్న దృక్పథం స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా స్థానికంగా స్పందిస్తామని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు.
కాఫీ, మిరియాలు, జీడితోటలు, ఇతర పండ్ల తోటలను గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలన్న జడ్పీ చైర్‌పర్సన్ విజ్ఞప్తికి ఎంపీ శ్రీభరత్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని, రైతులకు, వ్యవసాయ రంగానికి మరింత మద్దతు ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, దినేష్ కుమార్, విజయ కృష్ణన్, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.