ఇంత బాధ్యతారాహిత్యమా?
ఘాట్ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంపై గంటా అసంతృప్తి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకూడదని ఆదేశం
OSG NEWS 23-11-2024
పద్మనాభం, నవంబర్ 23: అనంత పద్మనాభస్వామి దీపోత్సవ సమయానికి ఘాట్ రోడ్డు, కలశ ప్రతిష్ఠ పనులు పూర్తి చేయలేకపోవడం పట్ల భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష మందికి పైగా భక్తులు వచ్చే ఉత్సవం పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా అని నిలదీశారు. “తమాషాలు చేస్తున్నారా? చాతకాకపోతే మానేసి వెళ్లిపోండి. దీపోత్సవానికి నెలరోజులు ముందే ఘాట్ రోడ్డు పనులు పూర్తి చేస్తామని పుడింగుల్లాగా చెప్పారు. ఇప్పటికిప్పుడు తారు రోడ్డు వేస్తే బాగుంటుందా?” అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. కాంట్రాక్టర్, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి కాలేదని, వచ్చే నెలలో ఘాట్ రోడ్డు, కలశ ప్రతిష్ఠ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన అతి పెద్ద పండుగకు వచ్చే ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకూడదన్నారు. వేలాది గా వచ్చే వాహనాలకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. దీపాలు వెలిగించే తొలిమెట్టు దగ్గర ఎక్కువ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతంలో సాధ్యమైనంత ఎక్కువ ఖాళీ ప్రదేశాన్ని వదలాలని తెలిపారు. భరతనాట్యం, కోలాటం వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి స్థానిక కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ప్రాథమిక వైద్యం సహా అత్యవసరం కోసం అంబులెన్స్ లను సిద్ధం చేసుకోవాలని, భక్తులకు సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని గంటా శ్రీనివాసరావు చెప్పారు. మహిళలు ఎక్కువగా పాల్గొనే ఉత్సవం కావడంతో మహిళా పోలీసులను ఎక్కువ సంఖ్యలో ఉంచాలని, మహిళలకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫైర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పటిష్టమైన పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం, హెల్ప్ లైన్లు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా దీపోత్సవం పోస్టర్ ను గంటా విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ సంగీత్ మాధుర్, నార్త్ ఏసీపీ అప్పలరాజు, ఈపీడీసీఎల్ డీఈ పోలాకి శ్రీనివాస్, ఎం.పి.డి.ఓ. ఎం.విజయ్ కుమార్, సింహాచలం దేవస్థానం ఏఈఓ రాజేంద్రకుమార్, ఏఈ రాంబాబు, పద్మనాభస్వామి దేవస్థానం ఈఓ నానాజీ, కూటమి నాయకులు కోరాడ రమణ, కె.దామోదరరావు, కాళ్ల నగేష్ కుమార్, కె.రామానాయుడు, శాఖారి శ్రీనివాస్, లీలావతి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనంత పద్మనాభస్వామి వారిని దర్శించుకున్నారు.